పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, నిర్మాణాలకు అవసరమైన భూములను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.
పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే, మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
క్యూర్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును పూర్తి చేయడంతో పాటు, రెండో, మూడో విడతల్లో చేపట్టనున్న నిర్మాణాలకు కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, రెండో, మూడో విడతలకు అవసరమైన భూముల గుర్తింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో నివసిస్తున్న పేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, పేదవాడికి సొంత ఇంటిని అందించడం కంటే తమ ప్రభుత్వానికి మరే అంశమూ ఎక్కువ ప్రాధాన్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూముల గుర్తింపు నుంచి నిర్మాణాల ప్రారంభం వరకు ప్రతి దశలోనూ నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని, స్థలాల ఎంపికలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం
క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు. మొదటి విడతకు సంబంధించి రెండు, మూడు నియోజకవర్గాలకు అవసరమైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని, మిగిలిన నియోజకవర్గాల్లో రెండో, మూడో విడతల నిర్మాణాలకు అవసరమైన భూములను కూడా ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.











