పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన 2021 నాటి వైద్య నివేదిక బహిర్గతం కావడంపై వివాదం రేగింది. తన అనుమతి లేకుండా వ్యక్తిగత వైద్య రికార్డులు ఎలా బయటకు వచ్చాయో వివరణ కోరుతూ మమతా బెనర్జీ తరఫు న్యాయవాది ఎస్ఎస్కేఎం ఆసుపత్రి, బాంగూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్, రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులకు న్యాయ నోటీసు పంపారు.
ఈ వివాదానికి 2021లో జరిగిన నందిగ్రామ్ ఘటన నేపథ్యంగా ఉంది. అప్పట్లో ఎన్నికల ప్రచార సమయంలో మమతా బెనర్జీ తన కాలికి గాయమైందని, కొందరు తనను వాహనం తలుపు వద్దకు నెట్టడంతో గాయం జరిగిందని ఆరోపించారు. అనంతరం ఆమె ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎన్నికల ప్రచారంలో వీల్చైర్లో కనిపించారు.
ఇటీవల రాజకీయ నాయకుడు శుభేందు అధికారి 2021 నాటి రేడియాలజీ నివేదికను ప్రస్తావిస్తూ, అందులో కాలిలో ఎముక విరగడం లేదా డిస్లొకేషన్కు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ గాయంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని కూడా తెలిపారు.
అయితే మమతా బెనర్జీ తరఫు న్యాయవాది ప్రధానంగా వైద్య గోప్యత, రికార్డులు బహిర్గతం చేసిన విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆసుపత్రి నుంచి వైద్య నివేదికలు ముఖ్యమంత్రి వద్దకు చేరాయా చేరితే ఏ చట్టపరమైన ప్రక్రియను అనుసరించారు కోర్టు ఆదేశాలు ఉన్నాయా అనే వివరాలను నోటీసులో కోరారు. అనుమతి లేకుండా లేదా చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా వ్యక్తిగత వైద్య సమాచారాన్ని బహిర్గతం చేసి ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై శుభేందు అధికారి స్పందిస్తూ, ఆ పత్రాలు ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో లేవని, అవి తనకు ఎక్కడి నుంచి లభించాయో అవసరమైతే వెల్లడిస్తానని చెప్పారు. అవసరమైతే ఎక్స్రే, ఎంఆర్ఐ నివేదికలను కూడా బయటపెట్టవచ్చని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం మమతా బెనర్జీ 2021లో ఎదుర్కొన్న గాయం నిజానిజాల కంటే, ఆమె వ్యక్తిగత వైద్య రికార్డులు ఎలా బహిర్గతమయ్యాయనే అంశంపై కూడా ప్రధానంగా చర్చకు దారితీసింది.
ఆసుపత్రి అధికారుల నుంచి న్యాయ నోటీసుకు వచ్చే సమాధానం ఈ వివాదంలో కీలకంగా మారనుంది.












