కడపచెన్నై జాతీయ రహదారిపై భాకరాపేట సమీపంలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు పాడి పశువులను ఢీకొన్న ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో గేదె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో రైతు తుర్ర శ్రీనివాసులుకు సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లింది.
మండలం భాకరాపేట గ్రామానికి చెందిన పాడి రైతు తుర్ర శ్రీనివాసులు తన గేదెలను రోడ్డుపై తోలుకొని వెళ్తుండగా, ప్రొద్దుటూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 04 జెడ్ 0358) వేగంగా వచ్చి వాటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది.
బస్సు పశువులను ఢీకొన్న అనంతరం ఆపకుండా వెళ్లిపోయిందని రైతు శ్రీనివాసులు ఆరోపించారు. తమ కుటుంబ జీవనాధారం పూర్తిగా పాడి పశువులపైనే ఆధారపడి ఉందని, ఈ ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన మూడు గేదెలతో పాటు గాయపడిన మరో గేదె కలిపి సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన బస్సు తిరుపతి వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు, రాజంపేట ఆర్టీసీ బస్టాండ్లో బస్సును గుర్తించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మండల ఎస్సై హారిక విచారణ చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.











