హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి సర్వేశ్ శర్మకు రక్షణ మంత్రిత్వ శాఖ అరుదైన గౌరవాన్ని అందించింది. భారత సైన్యం కోసం స్వదేశీ నిఘా డ్రోన్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.3.5 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది.
కంప్యూటర్ సైన్స్ ఐదో సెమిస్టర్ చదువుతున్న సర్వేశ్ శర్మ, రుద్ర ఎడ్జ్ టీ-1 (స్పెక్ట్రా) పేరుతో ఈ డ్రోన్‌ను రూపొందిస్తున్నారు. ఎత్తైన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపట్టారు. శత్రు రాడార్‌కు చిక్కకుండా, ఎలక్ట్రానిక్ జామింగ్‌ను తట్టుకునేలా డ్రోన్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే, ఇవి ప్రస్తుతం అభివృద్ధి లక్ష్యాలు మాత్రమేనని, డ్రోన్ తయారీ, పరీక్షలు పూర్తయిన తర్వాతే దాని పనితీరు నిర్ధారితమవుతుందని సంబంధిత నివేదికలు పేర్కొన్నాయి. సర్వేశ్ ఒక సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థి. ఆయన తండ్రి సంజీవ్ శర్మ రోజువారీ కూలీగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. పరిమిత వనరులతోనే సర్వేశ్ డ్రోన్ సాంకేతికతపై ఆసక్తి పెంచుకున్నారు.
జాతీయ స్థాయిలో ఐఐటీ జోధ్‌పూర్, కోనార్క్ కార్ప్స్ నిర్వహించిన ఓపెన్ కార్డ్బోర్డ్ డ్రోన్ పోటీలో సర్వేశ్ బృందం పాల్గొంది. దేశవ్యాప్తంగా సుమారు 50 బృందాలు పోటీపడగా, సర్వేశ్ బృందం నాలుగో స్థానంలో నిలిచి రూ.10 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. ఈ పోటీలో సైన్యం ఎదుర్కొంటున్న ఎత్తైన సరిహద్దు ప్రాంతాల నిఘా సవాళ్ల గురించి తెలుసుకున్న తర్వాత ప్రత్యేక డ్రోన్ నమూనాపై దృష్టి సారించారు.
సర్వేశ్ తన ప్రారంభ నమూనాను సుమారు రూ.87 వేల ఖర్చుతో రూపొందించారు. అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్, ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమాల కింద ప్రాజెక్టు ప్రతిపాదనను సమర్పించారు. తాజాగా ఈ ప్రతిపాదనకు రూ.3.5 కోట్ల గ్రాంట్ మంజూరైంది.
ప్రాజెక్టు అభివృద్ధికి ఐఐటీ రూర్కీకి అనుబంధంగా ఉన్న ఇంక్యుబేషన్ కేంద్రంలో ప్రయోగశాలలు, సాంకేతిక మార్గదర్శకత్వం అందించనున్నారు. ప్రాజెక్టును 20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ కవిందర్ గుప్తా సర్వేశ్‌ను అభినందించి, స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధికి యువతలో ఉన్న ప్రతిభను ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
రూ.87 వేలతో ప్రారంభమైన విద్యార్థి ప్రయోగం.. ఇప్పుడు రూ.3.5 కోట్ల రక్షణ ప్రాజెక్టుగా మారింది. అయితే, తుది డ్రోన్ సామర్థ్యాలు ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయి పరీక్షలు, సైనిక మూల్యాంకనం అనంతరం నిర్ణయించబడతాయి.


