సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు వివిధ పేపర్లలో వచ్చిన మార్కుల వివరాలను బహిరంగంగా వెల్లడించే పాత విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర సమాచార కమిషన్ సూచించింది. 2018 నుంచి ఈ వివరాల వెల్లడిని నిలిపివేయడానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, విధాన నిర్ణయం లేదా ఫైల్ నోట్ తమ వద్ద లేదని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) స్పష్టం చేసింది.
2017 వరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్‌లోని ప్రతి పేపర్‌కు వచ్చిన మార్కులను తెలుసుకునే అవకాశం ఉండేది. ఇందులో వ్యాసం, జనరల్ స్టడీస్ పేపర్లు 1 నుంచి 4, ఐచ్ఛిక సబ్జెక్టుల పేపర్లు, వ్యక్తిత్వ పరీక్ష మార్కులు వంటి వివరాలు ఉండేవి. అయితే 2018 నుంచి మొత్తం మార్కులను మాత్రమే వెల్లడిస్తున్నారు. ఈ మార్పుకు సంబంధించి అధికారిక ఆధారాలు చూపించలేకపోవడాన్ని సమాచార కమిషన్ ప్రస్తావించింది.
ఓ సమాచార హక్కు దరఖాస్తు ద్వారా 2018 నుంచి 2023 వరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల పేపర్వారీ మార్కుల వివరాలను కోరారు. అభ్యర్థుల పేర్లు, కేటగిరీ, మొత్తం రాత పరీక్ష మార్కులు, వ్యక్తిత్వ పరీక్ష మార్కులు, తుది మార్కులు ఇప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉన్నప్పుడు.. ఒక్కో పేపర్లో వచ్చిన మార్కులను మాత్రమే వ్యక్తిగత సమాచారం పేరుతో నిలిపివేయడం సమంజసం కాదని దరఖాస్తుదారు వాదించారు.
అయితే, ఐచ్ఛిక సబ్జెక్టుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను బహిరంగం చేస్తే కోచింగ్ సంస్థలు తమకు అనుకూలంగా కొన్ని సబ్జెక్టులను ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులుగా ప్రచారం చేసే అవకాశం ఉందని డీఓపీటీ వాదించింది. దీనివల్ల అభ్యర్థులపై తప్పుదారి పట్టించే ప్రభావం పడొచ్చని పేర్కొంది. అయితే ఈ నిర్ణయానికి మద్దతుగా ఎలాంటి అధికారిక రికార్డు, విధాన పత్రం లేదా కార్యాలయ ఉత్తర్వును సమర్పించలేకపోయింది.
ఈ అంశంలో యూపీఎస్సీ, డీఓపీటీ ఇచ్చిన వివరణల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. యూపీఎస్సీ ప్రకారం మెయిన్స్ అనంతరం అభ్యర్థుల పేపర్వారీ మార్కుల వివరాలను డీఓపీటీ, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేస్తుంది. మరోవైపు డీఓపీటీ మాత్రం ఈ మార్కులను రూపొందించి, నిర్వహించే బాధ్యత యూపీఎస్సీదేనని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌లో ఎంపికకు ఏడు పోటీ పేపర్లలోనూ కనీసం 10 శాతం మార్కులు సాధించాల్సిన నిబంధన ఉందని సమాచార కమిషన్ గుర్తుచేసింది. అందువల్ల ఒక్కో పేపర్లో అభ్యర్థులు సాధించిన మార్కులను వెల్లడించడం పరీక్షా విధానంలో పారదర్శకతను పెంచుతుందని పేర్కొంది. అలాగే ఐచ్ఛిక సబ్జెక్టుల ఎంపికలో అభ్యర్థులు వాస్తవ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో 2018 నుంచి 2023 వరకు ఎంపికైన అభ్యర్థుల జనరల్ స్టడీస్, ఐచ్ఛిక సబ్జెక్టుల పేపర్లు, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన వివరాలను మూడు వారాల్లో అందించాలని డీఓపీటీని కమిషన్ ఆదేశించింది. భవిష్యత్తులోనూ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎంపికైన అభ్యర్థుల పేపర్వారీ మార్కుల వివరాలను మళ్లీ బహిరంగంగా వెల్లడించే విధానాన్ని పునరుద్ధరించాలని సూచించింది.
అభ్యర్థుల మార్కులపై అధికారిక సమాచారం అందుబాటులోకి వస్తే, కోచింగ్ సంస్థలు లేదా అనధికారిక వనరులపై ఆధారపడకుండా సివిల్ సర్వీసెస్ ఆశావహులు తమ సన్నద్ధత, ఐచ్ఛిక సబ్జెక్టు ఎంపికపై మరింత సమాచారంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది.












