2026 ఆసియా పారా క్రీడల్లో భారత ఆర్చరీ క్రీడాకారిణి శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో మెరిశారు. ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి భారత కీర్తిని చాటారు. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంతో పాటు మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు.
దీంతో ఈ క్రీడల్లో శీతల్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో ఆమె రజత పతకం సాధించారు.
మిక్స్డ్ టీమ్‌లో తొలి స్వర్ణం
కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో శీతల్ దేవి, తోమన్ కుమార్ జోడీ, ఇండోనేషియాకు చెందిన టియోడోరా ఆడి ఆడియా ఫెరెల్లీ, కెన్ స్వాగుమిలాంగ్ జోడీతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత జోడీ 151148 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌కు స్వర్ణ పతకం లభించడంతోపాటు, గత ఆసియా పారా క్రీడల్లో సాధించిన మిక్స్డ్ టీమ్ టైటిల్‌ను శీతల్ మరోసారి నిలబెట్టుకున్నారు.
నాలుగు పాయింట్ల వెనుకంజ నుంచి విజయం
మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన నూర్ సయ్యదా అలీమ్‌తో శీతల్ దేవి పోటీపడ్డారు. ఆరంభంలో ప్రత్యర్థి ఆధిక్యంలోకి వెళ్లడంతో శీతల్ నాలుగు పాయింట్ల వెనుకబడ్డారు. అయితే, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా మంచి స్కోర్లు సాధించారు. చివరి దశలో ఒత్తిడిని అధిగమించి 142139 పాయింట్లతో విజయం సాధించి రెండో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
మరోసారి పతకాల హ్యాట్రిక్
శీతల్ దేవి గత ఆసియా పారా క్రీడల్లోనూ వ్యక్తిగత కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు, మహిళల జట్టు విభాగంలో ఒక రజతం సాధించారు. ఈసారి కూడా రెండు స్వర్ణాలు, ఒక రజతంతో మొత్తం మూడు పతకాలు సాధించి తన విజయ పరంపరను కొనసాగించారు. ఆమె ప్రదర్శన భారత పారా ఆర్చరీ జట్టుకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి చేతులు లేకుండానే పుట్టారు. అయినప్పటికీ, కాళ్లు, పాదాల సహాయంతో విల్లు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని గురిచూసే ప్రత్యేక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కఠోర సాధన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తున్నారు. ఆసియా పారా క్రీడల్లో ఆమె సాధించిన తాజా విజయాలు భారత క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపాయి.
ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా శీతల్ దేవి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఆమె విజయాలు పారా క్రీడాకారులకు మాత్రమే కాకుండా, లక్ష్యసాధనకు కృషి చేసే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తున్నాయి.











