వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సంటైల్ ఆధారిత అర్హత విధానానికి బదులుగా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన 12 మంది సభ్యుల నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు జాతీయ వైద్య కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం నీట్ పీజీ ఫలితాల్లో అభ్యర్థులకు పర్సంటైల్ ఆధారంగా అర్హత నిర్ణయిస్తున్నారు. కౌన్సెలింగ్ చివరి దశల్లో సీట్లు ఖాళీగా మిగిలితే అర్హత పర్సంటైల్‌ను తగ్గించే నిర్ణయం తీసుకుంటున్నారు. దీనివల్ల తక్కువ మార్కులు, కొన్ని సందర్భాల్లో ప్రతికూల మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా కౌన్సెలింగ్‌కు అర్హులవుతున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం అభ్యర్థుల పరీక్షా ప్రతిభ ఆధారంగా ర్యాంకులు ప్రకటించి, వాటి ఆధారంగా ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఫలితాల్లో పర్సంటైల్ మార్కులను ప్రకటించకుండా కేవలం ర్యాంకులు మాత్రమే వెల్లడించే విధంగా నిబంధనలు రూపొందించనున్నట్లు కమిటీ నివేదికలో పేర్కొన్నారు.
కొత్త విధానం వల్ల ప్రయోజనాలు
ఈ మార్పుతో కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆలస్యం తగ్గుతుందని, రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్ మధ్య సమయం తగ్గే అవకాశం ఉంటుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అయితే కొత్త విధానానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు.
అసలు వివాదం ఎందుకు మొదలైంది
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో భారీగా సీట్లు ఖాళీగా ఉండటంతో అర్హత ప్రమాణాలను తగ్గించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సవరించిన కటాఫ్ వివరాలను ప్రకటించింది. ఈ మార్పుల ప్రకారం, జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ 50వ పర్సంటైల్ నుంచి 7వ పర్సంటైల్‌కు, జనరల్ దివ్యాంగుల కటాఫ్ 45వ పర్సంటైల్ నుంచి 5వ పర్సంటైల్‌కు, ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ అభ్యర్థుల కటాఫ్ 40వ పర్సంటైల్ నుంచి 0 పర్సంటైల్‌కు తగ్గింది. మార్కుల పరంగా జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ 276 నుంచి 103కు, జనరల్ దివ్యాంగుల కటాఫ్ 255 నుంచి 90కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కటాఫ్ 235 నుంచి మైనస్ 40 మార్కులకు తగ్గింది. దీంతో ప్రతికూల మార్కులు వచ్చినవారికి కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
కటాఫ్ తగ్గింపును సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అర్హత ప్రమాణాలను ఇంత భారీగా తగ్గించడం వల్ల వైద్య విద్య ప్రమాణాలు దెబ్బతింటాయని, భవిష్యత్తులో వైద్య సేవల నాణ్యతపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా వైద్య విద్యలో ప్రమాణాలను కాపాడటంతో పాటు ఖాళీగా ఉన్న సీట్ల సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నీట్ ప్రవేశాల విధానాన్ని సమీక్షించి పలు సిఫార్సులు చేసింది.
ఖాళీగా మిగిలిపోతున్న వైద్య పీజీ సీట్ల సమస్యను పరిష్కరించేందుకు కమిటీ మరికొన్ని సూచనలు చేసింది. నాన్ క్లినికల్ పీజీ కోర్సుల ఫీజులను తగ్గించే అంశాన్ని పరిశీలించాలి. ప్రీ క్లినికల్, పారాక్లినికల్ కోర్సుల్లో చేరే అభ్యర్థులకు సర్వీస్ బాండ్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కౌన్సెలింగ్‌కు ముందుగానే ఖరారు చేయాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రతి విద్యా సంవత్సరానికి ముందే ప్రకటించాలి. అభ్యర్థుల గుర్తింపు కోసం కేవైసీ, బయోమెట్రిక్ విధానాలను ప్రవేశపెట్టాలి. కౌన్సెలింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు డిజిటల్ విధానాన్ని బలోపేతం చేయాలి. వరుసగా రెండు, మూడు సంవత్సరాలు సీట్లు ఖాళీగా ఉంటున్న కోర్సుల కొనసాగింపుపై సమీక్ష జరపాలి.












