భద్రాచలం, 2026-11-23
అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు.
అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో మారుమూల ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. గిరిజన దర్బార్‌లో భూ సమస్యలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ఆన్లైన్ నమోదు, పోడు భూములపై రైతుబంధు రుణాలు, స్వయం ఉపాధి పథకాలు, దీర్ఘకాలిక వ్యాధుల వైద్యానికి ఆర్థిక సాయం, ఉన్నత విద్యకు ఆర్థిక భృతి, వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు, బోర్లు, మోటార్లు, ఉపాధి శిక్షణ, ఒంటరి మహిళలు, వితంతువుల పింఛన్లు, చిన్న వ్యాపారాలకు రుణాలు, సోలార్ విద్యుత్ సదుపాయాలు, ఇసుక సొసైటీల సమస్యలు, గ్రామాలకు రహదారుల నిర్మాణం వంటి తదితర అంశాలపై గిరిజనులు అర్జీలు సమర్పించారు.
వచ్చిన ప్రతి వినతిని ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ వివరాలు పొందుపరుస్తున్నట్లు పీఓ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, విడతల వారీగా సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఎస్డీసీ ఆనంద్‌కుమార్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్, ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, ఏపీఓ పవర్ వేణు, పీవీటీజీ అధికారి గన్యా, ఎల్టీఆర్ డీటీ మణిధర్, మేనేజర్ ఆదినారాయణ, హౌసింగ్ ఏఈ హేమంత్, హెచ్ఈఓ కృష్ణయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనసూయతో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.







