అశ్వాపురం, 2026-11-23
ఖమ్మం జిల్లా పంటలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలిస్తూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారెళ్లపాడు మోటార్లను నిలిపివేయడంపై నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మారెళ్లపాడు మోటార్లను వెంటనే ప్రారంభించకపోతే సీతారామ పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలోని సీతారామ ఎత్తిపోతల పథకం, మారెళ్లపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొదటి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి ఖమ్మం జిల్లాలోని పంటలకు చివరి తడి నీళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అదే మండలంలోని మారెళ్లపాడు మోటార్లను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపుతుంటే, మారెళ్లపాడు మోటార్లను మాత్రం మరమ్మతుల పేరుతో నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయింది స్థానిక రైతులేనని, త్యాగాలు చేసింది ఈ ప్రాంత ప్రజలేనని, కానీ సాగునీరు మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించడం స్థానిక రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు.
ఎల్‌నినో ప్రభావం ఉందని, తాగునీటి అవసరాలు ఉన్నాయని చెబుతూ దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం, ఖమ్మం జిల్లా పంటలకు నీళ్లు తరలించే విషయంలో మాత్రం ఎల్‌నినో ప్రభావం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాతో పొత్తు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎప్పుడూ నష్టమే. జిల్లాలు వేరైనా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని రంగాల్లో ప్రభావితం చేస్తూ, ఏజెన్సీ ప్రాంతమైన మన జిల్లా సహజ వనరుల ద్వారా రావాల్సిన ప్రయోజనాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాలో ఉన్న నీరు, ఇసుక, బొగ్గు, పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్, అణు విద్యుత్, నీరు, పేపర్ పరిశ్రమలు తదితర వనరుల ద్వారా మన ప్రాంతానికి రావాల్సిన ఆదాయం, అభివృద్ధి ప్రయోజనాలు స్థానిక ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని విమర్శించారు.
రాజకీయంగా కూడా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, ఖమ్మం జిల్లా రాజకీయ ఆధిపత్యం కారణంగా మన ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇకనైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రయోజనాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లా హక్కులు, నిధులు, నియామకాలు, నీటి వాటా విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
మారెళ్లపాడు మోటార్లను వెంటనే ప్రారంభించి స్థానిక రైతులకు రబీ పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. తుమ్మల చెరువు ఆయకట్టుకు రబీ సాగు కోసం నీళ్లు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. స్థానిక రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా చేయడం దారుణమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు నీళ్లు, నిధులు తరలించుకుపోతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. జిల్లా ప్రయోజనాల కోసం, స్థానిక రైతుల హక్కుల కోసం ప్రజాప్రతినిధులు ఎందుకు గొంతు విప్పడం లేదని నిలదీశారు.







