బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి సమయంలో జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య ఈ ప్రక్రియ జరిగినట్లు వెల్లడించింది.
తీరం దాటినప్పటికీ వాయుగుండం ప్రభావం వెంటనే పూర్తిగా తగ్గే అవకాశం లేదని, మరో 12 గంటల పాటు తీవ్ర వాయుగుండంగా కొనసాగి, తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు
, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. సుమారు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆకస్మిక వరదలపై హెచ్చరిక
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాగులు, వంకలు, కాలువలు, లోతట్టు ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వర్షాలు, వరదల ముప్పు కొనసాగుతున్నందున రాబోయే 48 గంటలు అప్రమత్తత అవసరం.












