కొత్తగూడెం, 2026-11-23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ సోమవారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి, మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ సోమవారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల పురోగతిని సమీక్షించి, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. నాణ్యమైన దర్యాప్తుతో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకొని పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం స్టేషన్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.







