మన్యం జిల్లాలో పర్యటించిన అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణిని స్థానిక ట్యాక్సీ, ఆటో, మోటార్ యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కిరండూల్-కొటావల్సా రైల్వే లైన్లో సమస్యల కారణంగా నిలిచిపోయిన విశాఖపట్నం-అరకు రైలు సర్వీసును పునరుద్ధరించాలని వారు కోరారు.
కిరండూల్-కొటావల్సా రైల్వే లైన్లో ఏర్పడిన సమస్యల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోవడంతో అరకు, బొర్రా ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్న టాక్సీ, ఆటో, మోటార్ వాహన యజమానులు, డ్రైవర్లు, గైడ్లు, హోటల్ నిర్వాహకులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
కిరండూల్ వరకు రైలు సర్వీసు నడపడం ప్రస్తుతం సాధ్యం కాకపోయినా, కనీసం విశాఖపట్నం-అరకు మధ్యనైనా ప్యాసింజర్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే అరకు, బొర్రా ప్రాంతాలకు పర్యాటకుల రాక పెరిగి, పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
యూనియన్ నాయకులు, సభ్యుల వినతిని సానుకూలంగా ఆలకించిన ఎంపీ డా. గుమ్మ తనూజరాణి, ఈ సమస్యపై సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే రైలు సర్వీసు పునరుద్ధరణకు కృషి చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు.











