తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
హరేకృష్ణ ఫౌండేషన్, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా, నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సంస్థ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈఓ అనిల్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు రూ. 5.17 కోట్ల చెక్కును అందించారు.
అదేవిధంగా, వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థ ప్రతినిధి డి. సుమంత్, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు రూ. 4 కోట్ల చెక్కును అందజేశారు.
ఈ మంచి కార్యక్రమానికి నిధులు అందించి, సహకరించడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, హరేకృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్లను ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఈ కిచెన్ల ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, వారి శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఆహారంలో ఇచ్చే పదార్థాల కేలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని, బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని, వారికి అందించే ఆహార నాణ్యత విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్‌ను అందించే విధంగా చూడాలని, జీవితకాలం కొనసాగించాల్సిన ఈ కార్యక్రమం కాబట్టి సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. దీనికి గాను రూ. 5.17 కోట్లు, రూ. 4 కోట్లు చొప్పున చెక్కులను అందించారు.












