రాష్ట్రంలో తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.
భారీ వర్షాల కారణంగా కల్వర్టులు దెబ్బతినడం, గ్రామీణ రహదారులు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన నిర్దేశించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన సూచించారు.
వరదల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట నిర్వహించే పునరావాస కేంద్రాలలో పాలుపంచుకోవాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
వర్షాలు, వరదల కారణంగా పశువులు, ఇతర మూగజీవాలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాటికి అవసరమైన మేత, నీటి ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు. విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక తదితర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు.
విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.












