మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని ఐఎన్టియుసి నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు పీరినాకి నవీన్ స్థానంలో సీనియర్లలో ఒకరిని నియమించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
ఐఎన్టియుసి నాయకులు వెలగపల్లి జాన్ మాట్లాడుతూ, ప్రస్తుత మండల అధ్యక్షుడు పార్టీ కార్యకలాపాల్లో అందరినీ సమన్వయం చేయకుండా, ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు గ్రూపులుగా ఏర్పడి వారే నాయకులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు.
మండల అధ్యక్షుని హోదాలో ఉన్న నాయకుడు అందరినీ కలుపుకొనిపోతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని జాన్ సూచించారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం అవసరమని, ప్రస్తుత అధ్యక్షుని తీరు పార్టీ కార్యకర్తలలో నిరాశను కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత అధ్యక్షుని ఏకాభిప్రాయ నిర్ణయాలతో విసిగిపోయిన కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణమే అధ్యక్షుని మార్పు చేసి పార్టీ బలోపేతానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ (కార్మిక విభాగం) జిల్లా అధ్యక్షురాలు భోగినేని వరలక్మి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జానపటి వేణు, బత్తుల సుజాత, సొంది విజయ్ తదితరులు పాల్గొన్నారు.








