అశ్వాపురం, 2026-11-23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మారెళ్లపాడు ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు, తుమ్మలచెరువును నింపకుండా నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని, ప్రస్తుత మంత్రులు కేవలం ప్రారంభోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి అమరేందర్ మారెళ్లపాడు ప్రాజెక్టును స్వయంగా సందర్శించారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆయన ప్రభుత్వం మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు అని తెలిపారు. అహర్నిశలు శ్రమించి, శంకుస్థాపన చేసి, పనులన్నీ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అంతా సిద్ధం చేశాక నేటి మంత్రులు వచ్చి కేవలం ప్రారంభోత్సవం చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. మారెళ్లపాడు ప్రాజెక్టు ద్వారా తుమ్మలచెరువును నింపి స్థానిక రైతులకు, ప్రజలకు అంకితం చేస్తామని చెప్పిన మంత్రుల మాటలు పూర్తిగా నీటి మూటలయ్యాయని కోడి అమరేందర్ అన్నారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసి నెల రోజులు గడుస్తున్నా, ఇంతవరకు తుమ్మలచెరువు నిండకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
మా ప్రాంత నీళ్లను తరలించుకుపోతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, ఇక్కడి నీళ్లను తన సొంత నియోజకవర్గానికి తరలించుకుపోవడంపైనే దృష్టి పెడుతున్నారని, ఇక్కడి ఆయకట్టు రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కన్నతల్లి లాంటి మా ప్రాంతపు నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తక్షణమే తుమ్మలచెరువును నింపకపోతే బీజీ కొత్తూరు వద్ద మోటార్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇతర ప్రాంతాలకు నీటి తరలింపును ఆపి, ముందుగా తుమ్మలచెరువును నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేగా కాంతరావు నాయకత్వంలో, రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని కోడి అమరేందర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దైదా నారాయణరెడ్డి, ఈదర సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, చిలకా వెంకటరామయ్య, గొల్లగూడెం సర్పంచ్ కోండ్రు సోమయ్య, ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్, మండల యువజన విభాగం అధ్యక్షుడు గద్దాల రామకృష్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ చల్లా రాజేష్, మండల యువజన మరియు మైనారిటీ నాయకుడు నజీర్ షోను, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గజ్జి లోహిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







